How to Make Kobbari Perugu in Telugu and Health Benefits
మొదటి పద్ధతికావలసిన పదార్ధాలు
1. లేత కొబ్బరి ముక్కలు : ఒక కప్పు
2. కొబ్బరి నీళ్లు : ఒక కప్పు
3. పెరుగు : ఒక పెద్ద చెంచాడు (తోడుకు)
4. మట్టి పాత్ర : అర లీటర్ సామర్థ్యం కలది
తయారీ విధానం
కొబ్బరి బొండాలు అమ్మేవారి వద్ద నుండి మధ్యస్తంగా తయారు అయిన కొబ్బరి కలిగిన బోండాం కొట్టించుకుని, అందులోని కొబ్బరి (స్టీలు డబ్బాలో), నీళ్లను (స్టీలు బాటిల్) విడివిడిగా తెచ్చుకోవాలి. కొబ్బరి శుభ్రం చేసి, దానిపైన ఉన్న గోధుమ రంగు పొరను కూడా తీసివేసి, చిన్న ముక్కలుగా తరిగి కొలుచుకోవాలి. ఒక కప్పు కొబ్బరికి, ఒక కప్పు కొబ్బరి నీళ్లు పోసి మెత్తని గుజ్జులా రుబ్బుకోవాలి. కొబ్బరి లోని జిగురు ని బట్టి, అవసరమైతే ఇంకా అర కప్పు కొబ్బరి నీళ్లు పోసి రుబ్బుకోవాలి. మినప దోశ పిండి వంటి చిక్కదనంలో ఉంటే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని ఉంచిన పాత్రను మరుగుతున్న నీటి పాత్రలో ఉంచి, ఒక చెంచాతో కలుపుతూ గోరువేడెక్కగానే ఒక పెద్ద చెంచాడు దేశీ ఆవు పాల పెరుగు (మొదటిసారి మటుకు) అందులో బాగా కలిపి మట్టి పాత్రలో పోసి వెచ్చని ప్రదేశం లో ఐదారు గంటలపాటు ఉంచితే పెరుగు తయారవుతుంది. రెండోసారి నుండి కొబ్బరి పాలు పెరుగు తోడుకుని వాడుకోవచ్చు.
రెండవ పద్దతి
కావలసిన పదార్థాలు
1. కొబ్బరి తురుము : ఒక కప్పు
2. కొర్ర బియ్యం పాలు : రెండు చెంచాలు
3. మంచి నీళ్లు : ఒక కప్పు
4. మట్టి పాత్ర : అర లీటర్ సామర్ధ్యం కలది
తయారీ విధానం
మధ్యస్తంగా ముదిరిన కొబ్బరి కాయతో చిక్కని పాలు తయారు చేసుకోవచ్చు. ఒక కప్పు కొబ్బరి తురుమును ఒక కప్పు నీళ్లు చేర్చి మెత్తగా రుబ్బుకోవాలి. శుభ్రమైన తెల్లని ఖద్దరు / నూలు బట్ట / సంచిని తడిపి, గట్టిగా నీళ్లు పిండి, దాన్ని ఉపయోగించి కొబ్బరి గుజ్జు నుండి కొబ్బరి పాలను, విడతీసుకోవాలి. ఆరుగంటల పాటు నానబెట్టి ఉంచుకున్న రెండు చెంచాల కొర్రలు చట్నీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి చిక్కటి పాలు రుబ్బి వడపోసుకోవాలి.
ఒక దళసరి స్టీల్ గిన్నెలో కొర్రపాలను, అరకప్పు కొబ్బరి పాలు బాగా కలిపి, సన్నని మంట మీద కలుపుతూ ఉండాలి. కొద్దిగా చిక్కపడుతుండగా మిగిలిన కొబ్బరి పాలు పోసి కలుపుతూ రెండు నిమిషాలు మంటమీద ఉంచి ఆ తరువాత మట్టి పాత్రలో పోసి, చల్లార్చి గోరువెచ్చపడగానే దేశీ ఆవు పాల పెరుగు ఒక పెద్ద చెంచాడు తోడు పెట్టి, వెచ్చని ప్రదేశంలో ఉంచితే ఐదారు గంటలలో పెరుగు తయారవుతుంది. దాన్ని రిఫ్రిజిరేటర్లో పెట్టుకుని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు
కొబ్బరి పాల పెరుగు మామూలు పెరుగు వలే గట్టిగా తోడుకోదు. అలవాటు అయ్యేంత వరకు రుచి చూసుకుని, కొద్దిగా పులిసిన వెంటనే రెఫ్రిజరేటర్లో పెట్టు కుంటే మంచిది. ఈ పెరుగు చాలా సున్నితం. బయట పెడితే పాడయిపోతుంది. పెరుగుగా కాకుండా మజ్జిగ చేసుకుని వాడుకుంటే మంచిది
ఈ పెరుగుతో చేసే అన్ని పదార్థాలూ చాలా రుచిగా ఉంటాయి. చిన్న పిల్లలకు ఈ పెరుగు కొద్దిగా, అరటిపండు లేక మామిడి పండు కలిపి చిలికి లస్సీ లాగ తయారు చేసి ఇవ్వవచ్చు. సొరకాయ, పొట్లకాయ, తోటకూర, టమాటా వంటి పెరుగు పచ్చళ్ళు కూడా ఈ పెరుగుతో రుచికరంగా ఉంటాయి. అంబలిలో కొద్దిగా కొబ్బరి పాలు పెరుగు, ఉప్పు, కొత్తిమీర, పచ్చి మిర్చి చేర్చి సేవిస్తే రుచితో బాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది.
Post a Comment